Telugu short stories
నేను రాసిన తెలుగు షార్ట్ స్టోరీస్ ను బ్లాగ్ subscribers కోసం ఇక్కడ post చేశాను.
కథ - 1
డోపమిన్ ట్రాప్
డా. ఎ స్. రాజేష్ కుమార్
హాస్పిటల్ లో బెడ్ పై నిస్తేజంగా పడి వున్న తన కొడుకుని చూసి నిచ్చేస్తుడాయ్యడు శేఖర్. అతని ముఖం,అరచేతులు చమటతో తడిసిపోయాయి. గొంతు తడారిపోయింది.గొంతులో నుంచి మాట పెగడడం లేదు. కొంత దూరాన వున్న భార్య కవిత వైపు బేలగా చూసాడు.
కవిత కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీటిని ఆపుకోలేక, గొంతులో వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ... తడిసిన తన కళ్ళను చీర కొంగుతో అద్దుకుంటూ శేఖర్ వద్ద కు పరిగెత్తుకు వెళ్లి గట్టిగా కౌగాలించుకొని “వాడి ప్రాణాలకు ప్రమాదం
లేదు అంటున్నారండి డాక్టర్లు” అని వెక్కిళ్లు అపుకుంటూ జరిగిన విషయం చెప్పింది. శేఖర్ మాత్రం నోట మాట రాక స్థాణువుల నిలబడిపోయాడు.
ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది కవిత? అనడిగాడు శేఖర్.
అంతలోనే నర్స్ మిమల్ని డాక్టర్ గారు పిలస్తున్నారు అని చెప్పడంతో శేఖర్, కవిత తో కలిసి డాక్టర్ రూమ్ లో కి వెళ్లారు.
గది బయటకువస్తున్న శేఖర్ తో.“డాడీ.డాక్టర్ ఎమన్నాడు” అడిగింది కూతురు. గద్గద స్వరం తో బలహీనంగా మాట్లాడిన తండ్రి మాటలు కూతురు కి స్పష్టంగా వినిపించలేదు.
***
శేఖర్, కవిత లు ఇద్దరు ప్రభుత్వాద్యోగులు. కూతురు రవళి బీటెక్ మూడవ సంవత్సరం, కొడుకు ఆదిత్య ఆటలలో చురుకు, చదువు లో బ్రైట్ స్టూడెంట్ ఇటీవలే బీటెక్ అడ్మిషన్ తీసుకున్నాడు.శేఖర్ ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరం గా వేరే జిల్లా లో ఉండటం వల్ల కవిత తన ఆఫీస్ కి దగ్గర్లో ఇల్లు తీస్కుని పిల్లలను చదివిస్తున్నది.
***
అరె! ఆదిత్య వచ్చి భోజనం చేయి అంది కవిత. లేదమ్మా! నేను తినను అని చిరాకుగా సమాధానం ఇచ్చాడు. నాలుగైదు రోజులుగా సరిగా అన్నం తినటం లేదు.ఏంటో విషయం! కడుపులో వున్నది బయటకు కక్కితే బాగుంటుంది అంది తల్లి.
మమ్మీ! అంటూ చుట్టూ చేతులు వేసి నేనొకటి అడుగుతా కాదనొద్దు అన్నాడు ఆదిత్య.
.సరే లే. విషయం ఏంటో చెప్పు అంది కవిత.
మమ్మి ప్లీజ్, నాన్న ను నాకు 5 G స్మార్ట్ ఫోన్ కొనివ్వమను. కాలేజి నుండి pdf లెసన్స్, జూమ్, గూగుల్ మీట్ లో కొన్ని లేసన్స్ వినాల్సివుంటది.
“నీకు ఆల్రెడీ మొబైల్ ఉంది కదా నాన్న”. ఆ వుంది.
ఆ డొక్కు ఫోన్ ఇంటర్ నుంచి అడుగుతుంటే బీటెక్ లో ఇప్పించావ్. నాకు ఆ ఫోనొద్దు, అది పట్టుకెళ్తే ఇజ్జత్ పోతుంది.నేనేమైన ఆపిల్ 17 ప్రో అడుగుతున్ననా? అన్నాడు ఆదిత్య.
“ఇప్పటికిప్పుడు కాస్టలీ స్మార్ట్ ఫోన్ అంటే ఎలా. మీ డాడీ ఏమంటాడో.అయినా అక్క లాప్ టాప్ తో సర్దుకో నాన్నా అంది తల్లి.
మమ్మీ! నా ఫ్రండ్స్ అందరికి ఆపిల్ ఫోన్స్ వున్నాయి. మాది జెన్ జి తరం.నా చేతిలో కాస్లీ ఫోన్ లేక అందరి తో కలిసి తిరగలేకపోతున్న. నా చేతిలో చిన్న ఫోన్ చూసి ఫ్రెండ్స్ గేలి చేస్తున్నారమ్మ.
“సరే మీ నాన్న తో మాట్లాడుతా. ఆయనేమంటారో చూడాలి”. అంది కవిత.
“ఏమండి. ఆదిత్య స్మార్ట్ ఫోన్ కొన్నివమంటున్నాడండి? మీరు ఏమంటారు? భర్త తో కవిత.
“సరే చూద్దాం అని ఫోన్ సంగతి ని కొన్నాళ్ళు వాయిదా వేసాడు”. శేఖర్.
కానీ అబ్బాయి మొండిగా పట్టుపట్టడం, కాలేజి నుండి వాట్సాప్ మెసేజెస్ వస్తాయని. అలాగే పోస్ట్ కరోనా లో మొబైల్ లెర్నింగ్ కూడ టీచింగ్ లెర్నింగ్ లో భాగం కావడం వల్ల శేఖర్ కూడా అయిష్టంగా తల ఉపాడు.”ఆదిత్త్యా. స్మార్ట్ ఫోన్ రెండు వైపులా పదునైనా కత్తి లాంటిది. దాన్ని ఎట్లావాడుతావో చూస్తా” అన్నాడు శేఖర్. “నన్ను నమ్మండి డాడీ” తక్కువ స్క్రీన్ టైమ్ మేంటైన్ చేస్తా.
మమ్మీ, డాడీ ఇద్దరు సరే అనడంతో క్షణం ఆలస్యం చేయకుండ వెంటనే ముప్పైవేల వన్ ప్లస్ బ్రాండ్ మొబైల్ అమెజాన్ లో ఆర్డర్ చేసాడు.
కొత్త కాలేజి, కొత్త స్నేహాలు, కాంటీన్ లో తన క్లాసుమేట్ అమ్మాయిలు, అబ్బాయిలతో సరదా ముచ్చట్లు, స్వేచ్చా వాతారణం లో సెమిస్టర్ వన్ సాగిపోతుందాల. కాలేజ్ బస్సు గంట ప్రయాణంలో క్లాన్ ఆఫ్ క్లాషెస్,టెంపుల్ రన్ లాంటి ఆఫ్ లైన్ లో ఆడటం మొదలయింది.
గతంలో ఇంటికి రాగానే సాయంత్రం కొద్ది సేపు కాలనీ లొని పార్క్ కి అమ్మ తో పాటు వాకింగ్ కి వెళ్ళేవాడు. రాను రాను అన్నం తినడానికి తప్ప బయటకు రాకుండ ఎక్కువ టైమ్ తన రూమ్ లో గడుపుతుండడం తో తల్లి ఈ సంగతి శేఖర్ తో చెప్పింది.
ఆదిత్య కి లూడో కింగ్,Battlegrounds Mobile India (BGMI) (formerly PUBG Mobile)వంటి టీమ్ ఆన్లైన్ గేమ్స్ ఆడటం వ్యసనంగా మారింది.
“ఆదిత్య నీవు వాకింగ్ వెళ్లకుండా ఎక్కువ సమయం రూంలో ఎందుకు వుంటున్నావ్” అన్నాడు శేఖర్. “ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో బిజీ డాడీ” అన్నాడు. తన కొడుకు చెప్పేదాంట్లో సిన్సియరిటీ లేదనిపించింది శేఖర్ కు.బ్రైట్ స్టూడెంట్ అయిన నా కొడుక్కి ఇంటర్నల్ మర్క్స్ తక్కువ రావడం, సెమిస్టర్ ఎగ్జామ్స్ లో సబ్జక్ట్స్ ఫెయిల్ కావడం ఏంటి అనుకోని ఒక సారి కాలేజ్ కి వెళ్లి వాడి లెక్చరర్ ను కలిస్తే తెలుస్తుందని అనుకున్నాడు శేఖర్. మీ అబ్బాయి మెదట్లో క్లాస్ లో చాలా చురుకుగా ఉండేవాడు కాని ఈ మధ్య చదువుపై శ్రద్ధ పెట్టటలేదు అంది లెక్చరర్. కారణం ఏమైవుంటుందో ఆదిత్య తో మాట్లాడితే తెలుస్తుంది సర్.
శేఖర్ కి ఆదిత్య చదువులో వెనకబడటానికి కారణం స్పష్టంగా అర్థమయింది. తనకు గుండెలో ఎదో భారం గా అనిపించింది. కొడుకు చదువు పట్ల ఆందోళనే కాకుండా, తండ్రిగా తన బాధ్యతలో ఎక్కడైనా పొరపాటు జరిగిందా అనే ఆత్మపరిశీలన మొదలైయ్యింది.
“ఆదిత్య ఇక నుండి నువ్వు ఫోన్ ఇంట్లో వాడటానికి వీల్లేదు. అవసరమయినప్పుడు మమ్మి నీకు ఫోన్ ఇస్తుంది” అని చాలా కటువుగా గా చెప్పాడు శేఖర్.
“ఆలా కాదు డాడీ” అని ఆదిత్య ఎదో చెప్పబోయాడు. నువ్వు నోర్ముసుకొని చెప్పింది చెయ్యి అని అక్కడినుండి విసుగ్గా వెళ్ళిపోయాడు శేఖర్.
మొబైల్ గేమింగ్ లో స్నేహితుల ప్రోదబలం తో casual గేమర్ గా ప్రవేశించి అడిక్ట్ అయి హార్డ్‌కోర్ మొబైల్ గేమర్ మారాడు ఆదిత్య.
“మమ్మీ ఒక్క గంట సేపు మొబైల్ ఇవ్వు ప్లీజ్” అని తల్లి చేతులు పట్టుకుని ఆదిత్య బతిమిలాడాడు.
“నీకు చదువు పై ధ్యాస లేదు. ఫోన్ వాడకుండ కొన్ని క్షణాలు కూడా ఉండలేకపోతున్నావు. వెళ్లి చదువుకో “ అంది తల్లి.
"మమ్మీ, ఇప్పుడే నాకు ఫోన్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతా" అని ఆదిత్య బెదిరింపు ధోరణిలో ఆవేశంగా అరిచాడు. "నేను ఇవ్వనంటే ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో" అని తల్లి
ఖచ్చితంగా చెప్పేసరికి, "నేనేం చేస్తానో చూడు!" అంటూ ఆదిత్య విసురుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు.
కాసేపటి తర్వాత ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుండి పలకకపోవడంతో తల్లికి అనుమానం మొదలైంది. తలుపు తీసి లోపలికి వెళ్లి చూసిన తల్లి, సోదరి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఆదిత్య, పక్కనే ఖాళీగా ఉన్న నిద్రమాత్రల సీసాను చూసి వారి గుండె ఆగినంత పనైంది. ఆందోళనతో వణికిపోతూ, పక్కింటి వారి సహాయంతో వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
***
సైకాలజిస్ట్ ఆదిత్య ను కౌన్సిలింగ్ చేసిన తర్వాత శేఖర్ సైకాలజిస్ట్ తో “మా ఆదిత్య ను ఇలా చూడలేకపోతున్నాం ఎలాగైనా మా పాత ఆదిత్య మాకు కావాలి డాక్టర్” అని డాక్టర్ రెండు చేతులు గట్టిగ పట్టుకొని దీనంగా వేడుకున్నాడు.
ఇపుడు అధిక శాతం యువత డోపమైన్ ట్రాప్ (Dopamine Trap) లో వున్నారు. కవిత, శేఖర్ లు ఇద్దరు కంగారు గా “Dopamine ట్రాప్ అంటే ఏంటి డాక్టర్“ అన్నారు.
డోపమైన్ ట్రాప్ అంటే తక్షణ ఆనందం ఇచ్చే అలవాట్లకు (సోషల్ మీడియా రీల్స్, వీడియో గేమ్స్, జంక్ ఫుడ్) బానిసవ్వడం. దీని వల్ల ఆదిత్య గేమింగ్ అడిక్షన్ లేదా గేమింగ్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతకు గురయ్యాడు. దీని వల్ల మానసిక సమస్య లైన ఒత్తిడి, నిరాశ, మరియు ఒంటరితనం(Social Isolation),శారీరక సమస్యలైన నిద్రలేమి (Insomnia) మరియు ఆర్థిక పరమైన నష్టాలుంటాయి. ఆదిత్య ను రెహబిలిటేషన్ సెంటర్ లో చేర్చాలిసిన అవసరాన్ని సైకాలజిస్ట్ వివరించాడు.
***
పక్షం రోజుల డియాడిక్షన్ ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వచ్చిన ఆదిత్య “మమ్మీ, నా స్మార్ట్ ఫోన్ నీ దగ్గరే వుంచు, అవసరం అయితే నే ఫోన్ ఇవ్వు.అప్పుడప్పుడు జరిగే జూమ్ క్లాస్స్ కి అక్క లాప్టాప్ వాడతా”. మునిపటి ఆదిత్య ను చూసి శేఖర్, కవితలు మనస్సులో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
రెహబిలిటేషన్ లో ఇచ్చిన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) అలాగే శేఖర్, కవితలు ఆదిత్యకు ఇచ్చ్చిన కుటుంబ మద్దతు అతను పూర్తి కోలుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.
Dr.S. రాజేష్ కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్
డిపార్ట్మెంట్ అఫ్ ఇంగ్లీష్
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి
జిల్లా :-మేడ్చల్
@@@@@#####@@@@@
కథ -2
సాగర మథనం
“హలో! నాన్నా. సాగర్ ని,నేను,మీ కోడలు, మనవడు అందరం శుక్రవారం నాడు ఇండియా కి వస్తున్నాం“.
“సంతోషం బాబు. అమ్మా, నేను, మీరు ఎప్పుడొస్తారా అని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం.” అన్నాడు తండ్రి రమణయ్య.
రమణయ్య తన మనవడు తారక్ ని చూడక చాలా ఏళ్లయింది. వాడికిప్పుడు పదమూడు సంవత్సరాలు.ఏళ్ల నిరీక్షణకు త్వరలో తెర పడుతుండడం తో దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు రమణయ్య .
“నాన్నా. మీ షష్టిపూర్తి గ్రాండ్ గా హోటల్లో చేయడానికి మా స్నేహితుని ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను”. అన్నాడు సాగర్
“నాకు మీరు రావడం ముఖ్యం. ఇలా అయినా వస్తారని నేను ఒప్పుకున్నాను. అనవసర హంగు-ఆర్భాటం వద్దు” సుతి మెత్తగా అన్నాడు రమణయ్య.
***
రమణయ్య పదిఎకరాల అసామి. ఆ ఊళ్ళో నే కాక మండలంలో బాగా పేరున్న వ్యక్తి. ఊళ్ళో పెద్ద మనిషిగా పంచాయతీలలో సమస్యలు పరిష్కరిస్తూ తలలో నాలుకగా గా వుంటాడు.
కొడుకు సాగర్ ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు.
“నాన్న. నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. వెళ్లాలనుకుంటూన్నాను”.
ఆ మాటలు విన్న రమణయ్య ఒకింత షాక్ గురైయి మళ్ళి తెరుకొని
“అమెరికా వెళ్లిన వాళ్ళు తిరిగి రావడం అరుదు. నువ్వు ఇక్కడే ఉద్యోగం చూసుకో” కాస్తంతా కటువుగా అన్నాడు రమణయ్య.
“లేదు నాన్న నన్ను నమ్ము,
నా మీద ఒట్టు, నే తిరిగి వచ్చి ఇక్కడే సెటిల్ అవుతా.” గడ్డం పట్టుకుని బతిమిలాడాడు సాగర్.
అయిష్టం గానే “సరే”అన్నాడు రమణయ్య.
తన బంధువుల పిల్లలు గాని, చుట్టుపక్కల ఊళ్ళనుండి గాని అమెరికా వెళ్లిన వారు పెద్దగా లేరు, తన కొడుకు అమెరికా వెళుతుండడం తనకు ఒకింత గర్వంగానే వున్నా, తన మనసులోని బాధ ని బయటకు కనపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. సుదూరప్రాంతాలకు వెళుతున్న కొడుకు ఎలా ఉంటాడో, మళ్ళీ ఎప్పుడొస్తాడోనని ఆందోళన.
ఎయిర్పోర్ట్ లో “అమ్మా,నాన్నా, అక్కా, గుడ్ బై” అంటూ సాగర్ ముందుకువెళుతుంటే రమణయ్య మౌనం వెనుక ఉన్న సునామీ ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది; కళ్లలో నుండి లావా లా ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక గట్టిగా ఏడ్చాడు.
సాగర్ అమెరికన్ కంపెనీలో క్రమేణా ఉన్నత స్థానం కి ఏదిగాడు. అక్కడే స్థిరపడిన కుటుంబానికి చెందిన తెలుగు అమ్మాయి తో పరిచయం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది.
సాగర్ తన అమ్మా, నాన్న, మరియు అమ్మాయి తరుపు వారిని ఒప్పించి ఇండియా లో ఘనంగా పెళ్లి చేసుకొని ఆమెరికా వెళ్ళిపోయాడు. కొత్త జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది.
నాన్న “ నీకు మనవడు పుట్టాడు” అవతల ఫోన్లో సాగర్.
ఓ! తీపి కబురు.చాలా సంతోషం రా. మనవడు ఎలా వున్నాడు?.
“ మరి నువ్వు ఎప్పుడొస్తావ్ ”?
సాగర్ ఎప్పుడు ఫోన్ చేసినా రమణయ్య మాట్లాడే మొదటి మాట “ఎప్పుడొస్తావ్”.
“ఇక్కడ పని ఒత్తిడి వుంది. నా వీలు చూసుకొని వస్తా నాన్న” ఇదే మాట సాగర్ ప్రతిసారి చెప్పేది.
రమణయ్యకు మనవడితో ఆడుకోవాలని,ఊళ్ళో వాడి వేలు పట్టుకొని నడిపించాలని, తన బొజ్జ పై పడుకోబెట్టి జో కొడుతూ కథలు చెప్పాలని వున్నా అది ఒక కల లాగ మిగిలిపోయింది.
కొడుకు నాలుగు సంవత్సరాల కు ఒకసారి ఇండియా వస్తూ, అప్పుడప్పుడు వీడియో కాల్స్ లో మాట్లాడతున్నాడు. మనవడు తెలుగు కొద్దిగా అర్థం చేసుకోవడమే తప్ప మాట్లాడడం రాకపోవడం తో ఎక్కువ సేపు మాట్లాడలేక కాల్ ముగించేవారు.
“వాడికి ఇంగ్లిష్ తప్ప తెలుగు రాదు.
వాడు అమెరికన్ సిటిజెన్” అని సాగర్ భార్య గర్వంగా చెప్పేది. కొడుకు కన్నవారికి దూరం అవ్వడం,మనవడికి మాతృభాష రాకపోవడం తో వాడికి మూలాలతో ఉండే అనుబందం తెగిపోతుందేమోనని రమణయ్య ఆందోళన.
,****
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఊళ్ళో ని ఇంటి కి రాగానే
“హాయ్! తాతయ్యా, నాన్నమ్మ, What's up” అన్నాడు తారక్.
మనవడి ని ప్రేమ గా కౌగిలించుకొని, ఉద్వేగం తో “ఒరేయ్! నిన్ను ఎత్తుక్కొని మన వీధుల్లో, పొలంగట్ల నడవాలన్న కోరిక తీరాలేదురా.ఇపుడేమో నువ్వు పెద్దోడివయ్యావ్."
“యా. యా. ఓకేయ్ “అన్నాడు తారక్ ఏమి అర్థం కాక.
మనవడి ఇంగ్లిష్ బాష, యాస వారికి అర్థం కాక తికమక పడుతూ తలగోక్కుంటూ ఆ, ఆ.. అన్నారు.
తారక్ తెలుగు మాట్లాడడం రాకపోవడం తో తాతయ్య, నాన్నమ్మ ల తో ఎమోషనల్ బాండింగ్ లేక ఊళ్ళో ఉన్నన్ని రోజులు వారికి చుట్టాల అబ్బాయిగా అనిపించాడు.
“సాగర్. షష్ఠిపూర్తి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఘనంగా చేసావయ్య. నీ లాంటి కొడుకు ఉండడం రమణయ్య అదృష్టం”.అన్న బంధువు మాటలకు సాగర్ అవునన్నట్టు తలవుపాడు.
“ఎం రమణయ్య, నీ కొడుకు అమెరికా లో బాగానే సంపాదించ్చినట్టున్నాడు, డబ్బుల కు ఏ లోటు లేదు, నువ్వు దర్జాగా శేషజీవితం గడిపేయవచ్చు” అన్న బంధువు మాటలు రమణయ్యకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ఏటా అబ్బాయి పంపే డాలర్ల కంటే, పలకరించే గొంతు కోసం, మనవడి తో ఆడుకునే క్షణాల కోసం ఆయన మనసు తహతహలాడుతుంది.
రమణయ్య తన కొడుకు సాగర్ తో
“నా మనవడికి తెలుగు రాకపోవడం తో మేం వాడితో సరిగా కనెక్ట్ కాలేకపోతున్నాం రా. మానసిక అనుబంధం లేకపోతే వాడికి మన వాళ్ళు అని ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు “.అన్నాడు.
భాషా పరమైన అడ్డంకులు ఎలాగోలా దాటవచ్చు కానీ, భావోద్వేగ బంధం బలహీనపడటం రమణయ్య దంపతులను తీవ్రంగా బాధిస్తోంది.
మనవడితో మనసు విప్పి మాట్లాడుకోలేకపోవడం వల్ల కలిగే వెలితి ఎవరు తీర్చలేనిది. ఊళ్ళో సమస్యలకు ఇట్టే పరిష్కారం చూపే రమణయ్య తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు.
“నాన్నా! మేం అమెరికా కు వెళుతున్నాం. మళ్ళీ వచ్చినపుడు నిన్ను, అమ్మ ను నా తో పాటు తీసుకువెళ్తా” అన్నాడు సాగర్.
“కొత్త దేశం,తెలియని భాష గల వాతావరణంలో తాము మరింత పరాయివారం అయిపోతాం” అంది సాగర్ తల్లి
తల్లితండ్డ్రుల ముఖం లో నిసత్తువ,నిర్వేదం ప్రస్ఫుటంగా సాగర్ కు కనిపించినా, కొంతకాలం గడిస్తే అన్ని సర్దుకుంటాయి అని తనకు తాను సర్దిచెపుకుంటూ ఎయిర్పోర్టు కు టాక్సీ ఎక్కాడు.
****
“హలో, హలో,సాగర్. నాన్న కు తీవ్ర గుండెపోటు ఆసుపత్రి లో చేర్చాం, డాక్టర్స్ 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేం అంటున్నారు”. అక్క ఫోన్ లో.
“ అయ్యో! దేవుడా. ఎలా జరిగింది. ఇప్పటికిప్పుడు నేను రాలేనక్క. టికెట్ బుక్ చేసుకోవాలి. కనీసం రెండు రోజులైనా పడుతుందేమో”.
మరునాడు అక్క “హలో. సాగర్ నాన్న మనకు ఇక లేరు రా, మనన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు “ అని వెక్కి వెక్కి ఏడుస్స్టూనేవుంది.
తన ఏడుపు కు బ్రేక్ వేస్తూ సాగర్ “అక్కా నేను ఓక్కనే వస్తున్న, అంతవరుకు డెడ్ బాడీ ని హాస్పిటల్ మార్చురీ ఫ్రీజర్ లో ఉంచండి.” అని ముక్తసరిగా ముగించాడు.
అంత్యక్రియలు, ఆస్థిక నిమజణ్ణం, నెల మాసికం పూర్తి చేసిన సాగర్ అమ్మ తో “అమ్మా, నేను వచ్చి నెల రోజులైంది,అమెరికా కు తిరిగి వెళ్ళాలి. మరి నీ సంగతీ…. “
“మీ నాన్న చివరి సమయం లో మనవడి చేతి స్పర్శ కై ఎంతో పరితపించారు.” కళ్ళలో నించి ఊటలా ఉబికివస్తున్న కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంటూ అమ్మ మాట్లాడుతున్న మాటలకు జవాబు లేక సాగర్ నిస్సహాయుడుగా నిలబడ్డాడు.
“కష్టకాలంలో నాన్న నేనున్నాను, నీకేం కాదు అని భుజం మీద చేయి వేసి ధైర్యాని ఇచ్చే కొడుకు పక్కన లేడే ”అని సాగర్ పై పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే అమ్మ కన్నీళ్ల తో తన షర్ట్ తడిసి వళ్లంతా చల్లబడింది.
“అమ్మా నీ బాధ నాకు తెలుసు. ఇపుడు నన్నేం చేయమంటావ్?” అంటూ తల్లిని చేయిపట్టుకొని నెమ్మదిగా సోఫా లో కూర్చోపెట్టాడు.
సాగర్ తల్లి 15 ఏళ్ల క్రితం మీ నాన్నకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో.“మీరు ఇండియా వచ్చేయండి బాబు”.
ఎం చెప్పాలో తోచక “నీ కోడలు తో మాట్లాడుతా, ఇక నే వెళతాను” అని సాగర్ కారెక్కడు.
సాగర్ మనసులో అమ్మ మాటలు గట్టిగా నాటుకున్నాయి. కారు ఎక్కినప్పటి నుండి ఫ్లైట్ దిగే వరకు ఆ ఆలోచనలు అతన్ని వదలలేదు, సాగర మథనం మొదలయింది. ఇండియా తిరిగి రావడమే సరైన నిర్ణయమా? తన భార్య, అత్తగారి కుటుంబం అందుకు ఒప్పుకుంటారా. ఇపుడు కొడుకు కి పదమూడు ఏళ్ళు, అమెరికా ఎడ్యుకేషన్ సిస్టం కి, కల్చర్ కి అలవాటు పడ్డవాడు ఇక్కడ సర్దుకుపోగాలడా? అనేక ప్రశ్నలు మస్తిష్కం లో మెదులుతుండగా…
లేడీస్ అండ్ జెంటిల్మన్, వెల్కమ్ టు మిన్నెసోట! అని ఫ్లైట్ అనౌన్సమెంట్ తో ఇ లోకంలో కి వచ్చాడు సాగర్.
Dr.S. రాజేష్ కుమార్
14/2/2026
@@@@@****@@@
కథ -3
*ఆధార్ ఓటీపీ *
డాక్టర్ ఎస్. రాజేష్ కుమార్
చామనఛాయ రంగు, గుండ్రని ముఖం కలిగి, నీలం రంగు షర్ట్‌ను నలుపు రంగు ప్యాంట్‌లో టక్ చేసి, మెడలో ఐడి కార్డుతో ఉన్న సుమారు ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు ఒకడు.. హడావిడిగా, ఆందోళనగా చేతిలో స్మార్ట్ ఫోన్‌తో శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లోకి వచ్చాడు. రాగానే అక్కడున్న కానిస్టేబుల్‌తో, “ప్లీజ్ సార్! నేను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారిని కలవాలి” అన్నాడు."
అంతలోనే ఇన్స్పెక్టర్ ఉమేష్ తన గది నుండి బయటకు రావడం చూసి
“సార్. నా భార్య మరియు నా ఆరు నెలల కొడుకు కనిపించట్లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా” అన్నాడా వ్యక్తి.
సరే, అని ఇన్స్పెక్టర్ అతనిని లోపల కూర్చోబెట్టి, కొన్ని మంచి నీళ్లు తాగు అని గ్లాస్ చేతికిచ్చి,
ఏం జరిగింది వివరంగా చెప్పు? అని విషయాలు అడగడం మొదలుపెట్టాడు.
“సర్ నా పేరు నరేష్. ఒక ప్రైవేట్ బ్యాంకు లో మధురానగర్ బ్రాంచ్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను” అంటూ తన భార్య, కొడుకు తో సహా అదృశ్యం అయిన విషయం విపులంగా చెప్పాడు.
అంతా విన్న ఇన్స్పెక్టర్ ఉమేష్.
“సరే. వాళ్ళ పేరు,ఫోటోలు మరియు ఇతర డీటెయిల్స్ తో కంప్లైంట్ ను ఎస్సై గారికి ఇచ్చి వెళ్ళు” అన్నాడు.
మరుసటి రోజు రజిని తల్లి తండ్రులు స్టేషన్ కు వచ్చి
ఇన్స్పెక్టర్ తో “సర్ మా అల్లుడే మా బిడ్డను, మనుమడిని చంపి నాటకాలు ఆడుతున్నాడు. వాడు రాక్షసుడు, అనుమాన పిశాచి. రోజూ కొడుతున్నాడని మాకు చెప్పేది. మీకు దండం పెడ్తం వాడిని వదలద్దు”. అంటూ కాల్లావేళ పడ్డారు.
“వాడిని కూడా ఇంటారాగెట్ చేస్తున్నాం. త్వరలో అన్ని తెలుస్తాయ్.” అని వారిని సముదాయించి పంపాడు ఇన్స్పెక్టర్ ఉమేష్.
నరేష్ ని అన్ని విధాలా ప్రశ్నంచిన పోలీస్ లకు ఏమి క్లూ లబించలేదు.
రజిని ఫోన్ ఆన్ చేసి లేకపోవడం, ఎటువంటి క్లూ కూడా దొరకపోవడం తో కేసు ఎట్లా చేదించాలో అని ఇన్స్పెక్టర్ తలపట్టుకున్నాడు.
అంతలోనే కానిస్టేబుల్ “సార్, ఊరి బయట చెరువు దగ్గర ఒక మహిళ బట్టలు, చెప్పులు, చిన్న బ్యాగ్ దొరికాయి చూడండి అని టేబుల్ పై ఉంచాడు.
“సర్, ఆ వస్తువులు నా భార్య వే.” అన్నాడు నరేష్ ఇన్స్పెక్టర్ తో.
“సైకో ఎదవవి నువ్వే రజిని ని చంపి శవాన్ని చెరువులోకి తోసేసావు లేదా డెడ్ బాడిని మాయం చేశావు కదూ. నిజం చెప్పు అని కనుగుడ్లు ఉరిమి, తన గంభీరమైన కంఠస్వరంతో గట్టిగా గదమాయించాడు” ఇన్స్పెక్టర్.
“సార్. వీడికి పోలీస్ లాఠీ దెబ్బ రుచి చూయించి, నిజం కక్కిస్తా”. అంటూ లాఠీ ఎత్తి నరేష్ ను కొట్టబోయాడు కానిస్టేబుల్.
నువ్వు ఆగవయ్య బాబు! అంటూ కాన్స్టేబుల్ ను తన చేత్తో అడ్డుకున్నాడు ఇన్స్పెక్టర్.
ఆ ఏరా! నరేష్.
“నీ మొబైల్ నుండి రజిని మొబైల్ కు “నిన్ను చంపేస్తా“ అని మెసేజ్ పెట్టి డిలీట్ చేసావ్, అవి క్లౌడ్ బ్యాకప్‌లో స్టోర్ అయ్యాయి”.నిజమేనా?
“అయ్యో! నాకే పాపం తెలియదు.నేను ఏ మెసేజ్ పెట్టలేదు. నన్ను నమ్మండి సార్” అంటూ నరేష్
బోరున ఏడుస్తూ ఇన్స్పెక్టర్ కాళ్ళ పై పడ్డాడు.
******
నరేష్ చేతులు వణుకుతుండగా తన ఫోన్ స్క్రీన్‌ను ఇన్‌స్పెక్టర్ వైపు తిప్పాడు.
"సార్.. చూడండి! నా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. నా భార్య ఆధార్ ఓటీపీ ఇది. తను అదృశ్యమై మూడు సంవత్సరాలు అవుతుంటే. ఇప్పుడు ఈ OTP రావడం ఏంటి సార్?"
అయోమయంగా చూస్తున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ తో
అక్కడే వున్న కానిస్టేబుల్
“సార్.ఇది పాత కేసు” అంటూ ఓ దుమ్ము పట్టిన ఫైల్ ను గుడ్డ తో తూడుస్తూ టేబుల్ పై ఉంచాడు. ఆ ఫైల్ లో పేజీలు గబగబా తిప్పేసిన ఇన్‌స్పెక్టర్, నరేష్ ఫోన్ లో ఆ మెసేజ్‌ను తీక్షణంగా పరిశీలించి, గడ్డం నిమురుకుంటూ ఆలోచనలో పడ్డాడు.
"హుమ్.. నీ భార్య బతికే ఉంది”. అన్నాడు ఇన్స్పెక్టర్.
నరేష్ కళ్లలో ఒక చిన్న ఆశ మెరిసింది. "అయితే తను ఎక్కడుందో తెలుస్తుందా సార్?".
ఆధార్ అప్డేట్ కోసం ఏదైనా మీ-సేవా సెంటర్ లో బయోమెట్రిక్ వేలిముద్ర వేసినప్పుడు ఇలా లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
ఇప్పుడే సైబర్ క్రైమ్ టీమ్ తో మాట్లాడుతా.
ఆ నరేష్. “ఆ OTP రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశాం. లొకేషన్ ఏపీ లోని గుంటూరు లో చూపిస్తోంది."
నరేష్ షాక్‌తో "గుంటూరా? అసలు తనకి అక్కడ ఎవరూ లేరే! తను అక్కడికి ఎందుకు వెళ్తుంది?"
"అదే ఇప్పుడు మిస్టరీ. అక్కడికి కి వెళితే నీ భార్య అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుంది. ఆ మిస్టరీని అక్కడే ఛేదిద్దాం! పద” అని ఇన్స్పెక్టర్ బయలుదేరాడు.
గుంటూరు కు వెళ్ళిన పోలీస్లు రజినిని అక్కడ పట్టుకోలేకపోయారు.
ఆధార్ అప్డేట్ కోసం ప్రయత్నించినప్పుడు తన ఆధార్ కు నరేష్ ఫోన్ నెంబర్ లింకయివుంది అని అర్థం కాగానే, తను చేసిన పొరపాటు గ్రహించి అక్కడ నుండి ఉడాయించింది రజిని.
వెంటనే లోకల్ పోలీస్ సహాయం తో సీసీటీవీ ఫుటేజ్ చుస్తే
ఆమె మరో వ్యక్తి తో కలిసి విజయవాడ బస్ ఎక్కినట్టు గుర్తించాడు ఇన్స్పెక్టర్ సుధాకర్.
ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ తో విజయవాడ పోలీస్ రజినిని మరియు ఆమెతో వున్న వ్యక్తి ని శంషాబాద్ పోలీస్లకు అప్పచెప్పారు.
స్టేషన్ లో ఓ మూలాన బక్కపలుచని రూపం, చూడగానే ఆకట్టుకునే ముఖవర్చస్సు ఉన్న రజిని, ఆమె చేయి పట్టుకుని అమాయకంగా చూస్తున్న మూడేళ్ల పిల్లాడు, వారి పక్కన నలుపు రంగు ముఖం, మంచి ఎత్తు,వత్తు మీసాలు, ట్రిమ్ చేసిన గడ్డంతో గంభీరంగా నిలబడ్డ ముప్పై ఐదు ఏళ్ల వ్యక్తి.
భార్య తనను మోసం చేసి, పరాయి వ్యక్తి తో మూడేళ్లు గడిపిందనే విషయాన్ని నరేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
అంత సేపు మౌనంగా వున్న రజిని ఇన్స్పెక్టర్ వరుస ప్రశ్నలతో నూరు విప్పింది.
“సార్, కట్టుకున్నందుకు తప్పదుకదా మొగుడైనా మానైనా భరించాల్సిందే అని చాలా రోజులు సరిపెట్టుకున్నా. కానీ నాకు ఓపిక నశించింది. నా భర్త పెట్టె చిత్రహింసలు భరించలేక చెరువులో దూకి చనిపోదామనుకొని ఆరు నెలల కొడుకును తీసుకొని ఇంటి నుండి వెళ్ళాను. సుబ్బరాజు అనే వ్యక్తి నీళ్లలో మునిగిపోతున్న నన్ను, నా కొడుకుని కాపాడి ఒడ్డు కు చేర్చాడు. నా ఆత్మహత్య ప్రయత్నానికి నా భర్త పెట్టిన వేధింపులే కారణమని తెలుసుకున్న సుబ్బరాజు, పోలీస్ కు కంప్లైంట్ చేద్దాం అంటే నేనే వద్దన్నాను. ఎందుకంటే ఆ పోలీసులు నచ్చచెప్పి మళ్ళీ నా భర్త దగ్గరికే పంపుతారని వద్దన్న.
నువ్వు ఇక్కడే ఉంటే రోజు చిత్రహింసలు పడాల్సి వస్తుందని సుబ్బరాజు అదే రాత్రి నన్ను గుంటూరు తీసుకెళ్లాడు.
అతనితో కొత్త జీవితం మొదలుపెట్టి మూడు సంవత్సరాలైంది.
“మరి ఆధార్ సెంటర్ కు ఎందుకు వెళ్ళావ్?” అడిగాడు ఇన్స్పెక్టర్.
నా కొడుకు ను అంగన్వాడీ లో వేద్దామంటే నా ఆధార్ అడ్రస్, ఫోటో అప్డేట్ చేసుకోవాలన్నారు.
అప్డేట్ తో ఓటీపీ నరేష్ కు వస్తుందని నాకు తట్టలేదు.
మరి ఫోన్ లో “నిన్ను చంపేస్తా” అని నరేష్ నీకు మెసేజ్ చేసాడుగా? అడిగాడు ఇన్స్పెక్టర్.
“సార్. అది నేనే ఆయన మత్తు లో వున్నప్పుడు నరేష్ మొబైల్ నుంచి నా మొబైల్ కు బెదిరింపు మెసేజ్ చేసి డిలీట్ చేశా”.
మరి బట్టలు, బ్యాగ్, చెప్పులు అక్కడే చెరువు దగ్గర ఎందుకు వదిలేశావ్? గట్టిగా అడిగాడు ఇన్స్పెక్టర్.
నన్ను నరేష్ చంపాడని అనుమానించడానికి సీన్ క్రియేట్ చేశా సార్.
“సార్. నా భార్య తప్పులను క్షమిస్తున్నా. మళ్ళీ నా జీవితంలో కి ఆహ్వానిస్తున్న.
దయచేసి నా భార్య ను, కొడుకును నాతో పంపండి” అని దీనంగా బతిమిలాడాడు నరేష్.
“ఒరేయ్! నరేష్ అమాయకుడిగా నటించకు, నువ్వు పెట్టిన టార్చర్ని రజిని రహస్యంగా మొబైల్ లో రికార్డ్ చేసింది చూడు” అని ఇన్స్పెక్టర్ ఫోన్ ను నరేష్ ముఖం ముందుంచాడు. నరేష్ తన హింసాప్రవృత్తి ( violent tendency ) బయటపడటంతోతన భార్య కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం లేక తలదించుకొని, చేతులు కట్టుకొని మరోపక్క నిలబడ్డాడు.
“నన్ను మళ్ళీ ఆ నరకకూపంలోకి నెట్టకండి సార్.
నా మనసు గెలుచుకున్న సుబ్బరాజు తోనే వుంటా” అని రజిని చాలా నిక్కచిగా ఇన్స్పెక్టర్ తో చెప్పింది.
“నరేష్ పై గృహహింస కేసు పెట్టండి. రజినినీ కోర్ట్ లో హాజరుపర్చండి”.అని ఇన్స్పెక్టర్ అక్కడినుండి వెళ్ళిపోయాడు.
***
ఆర్డర్, ఆర్డర్....
“పోలీస్ లను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు రజినికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 498A ఐపీసీ కింద నరేష్ కు
మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదువేల జరిమానా విదిస్తున్నాం” అంటూ జడ్జి తీర్పు చదివాడు..
తీర్పు వింటున్న రజిని మొహంలో చిన్న గెలుపు నవ్వు.
Dr. S . రాజేష్ కుమార్
23/02/2026
కథ - 4
*సైబర్ ట్రాప్ *
డాక్టర్.ఎస్. రాజేష్ కుమార్
“ఏమండి. ఈ రోజు సాయంత్రం ఆటోవాడు రానన్నాడు, బాబును వచ్చేటటప్పుడు స్కూల్ నుంచి పికప్ చేసుకొనిరా. మర్చిపోకు.” అంది లక్ష్మి, భర్త కిషోర్ తో.
“సరే లక్ష్మి. ఓకే. బాయ్” అంటూ చేయి ఊపుతూ బైక్ పై ఆఫీస్ కు బయలుదేరాడు కిషోర్.
పీజీ పూర్తి చేసిన కిషోర్ ఒక ప్రైవేట్ చిట్ ఫండ్
లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నెలకి నలభై వేల కు పైగా జీతం తో గత ఐదు సంవత్సరలుగా ఉద్యోగం లో ఎదుగు బోదుగు లేదని ఒకింత అసంతృప్తి తో నెట్టుకోస్తున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కిషోర్ ని “ఏమైంది కిషోర్ అలా వున్నావు? కాఫీ కప్పు చేతికిస్తూ అడిగింది లక్ష్మి.
“చిట్ ఫండ్ లో మేనేజర్ నన్ను కలెక్షన్స్ సరిగా చేయట్లేదని, పనిపై శ్రద్ద పెట్టటలేదని చివాట్లు పెట్టాడు. అందుకే ఉద్యోగం వదిలి ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్న.” అని తన మనసు లో మాట చెప్పాడు భర్త కిషోర్.
అందుకు తన మామ కొంత ఆర్థిక సహకారం అందిస్తే తనకు సులభం అవుతుందని తన భార్య తో
“ఏంటి లక్ష్మి మీ నాన్న ఏమైనా డబ్బు సర్దుతాడా?”అడిగాడు ప్రేమతో కిషోర్.
“వాళ్ళ దగ్గర డబ్బు లేదండి” అంది లక్ష్మి.
ఎందుకు అబద్దాలు చెప్తావ్ లక్ష్మి. మీ నాన్న మొన్న ఎకరం పొలం అమ్మగా వచ్చిన డబ్బులు ఏంచేసాడేంటి?
“నా పెళ్ళికి చేసిన అప్పు తీర్చి మిగతాది మా చెల్లి పెళ్లికని దాచారు.” అని సున్నితంగా కుదరదు అని చెప్పింది లక్ష్మి.
“నాకు అత్తగారి సొమ్ము బాకి లేదనుకంటాలే” అని భారంగా నిట్టూర్చాడు కిషోర్.
మరునాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ “లక్ష్మి, నా ఫ్రెండ్ తో కలిసి ప్రైవేట్ గా తక్కువ పెట్టుబడితో చిన్న చిట్ ఫండ్ స్టార్ట్ చేయాలని నా ప్లాన్” ఏమంటావ్ లక్ష్మి.
“ముందు ఆన్లైన్ గేమ్స్ ఆడడం మానెయ్ ” బాగుపడతావ్ అంటూ లిప్స్టిక్ అద్దుకుని అద్దంలో మరోసారి చూసుకుంటూ,వాచ్ పెట్టుకుని, రోజూలాగే బ్యాగ్ భుజానేసుకుని ఇంటి నుండి తాను పనిచేస్తున్న ప్లే స్కూల్ కి పరుగు లాంటి నడక మొదలెట్టింది లక్ష్మి.
కిషోర్ కు ఆడవాళ్లు తెలివైన వారు కాదని, అందులో ముఖ్యంగా తన భార్య జస్ట్ ఇంటర్ పాస్ కు అంతగా
నాలెడ్జ్ లేదని ప్రగాఢ విశ్వాసం.
టీవీ 9 లో వస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ పై కాంగ్రెస్, బిర్ఎస్ లీడర్ల వాడి వేడి చర్చ చూసి లక్ష్మి ఎదో చెప్పబోతుండగా “నీకు పాలిటిక్స్ తెలువదు, వంటింట్లో నీ పని చుస్కోపో అని కసురుకున్నాడు. క్రికెట్ మరియు రాజకీయాలలో తను ఓ గొప్ప విశ్లేషకుడని కిషోర్ ఫీలింగ్.
పొద్దునే లేచి సోఫా లో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ వాట్సాప్ మెసేజెస్ చెక్ చేస్తున్న కిషోర్ కి ఒక లింక్ తో వున్న మెసేజ్ వెరైటీగా అనిపించింది. అంతలోనే లక్ష్మి
“ఏమండి. మీరు ఇలా ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఎలా. వెళ్లి పాల ప్యాకెట్ తెండి. రోజు నాకు ఇదో గోల. అని వంటింట్లో నుంచి గట్టిగా అరిచింది.”
“ఆ. సరే. వెళ్తాను.” అని అంతే గట్టిగా హాల్ లోంచి అరిచి మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేస్తూ కిషోర్ ఆ లింక్ గురించి తెలుసుకుందామని కురియాసిటీ తో “వాట్ ఇస్ థిస్” అని మెసేజ్ పెట్టాడు కిషోర్. వెంటనే
అవతలి వ్యక్తి కాల్ చేసి తాను హిమేష్ అని పరిచయం చేసుకొని
“సర్ మీకు వచ్చిన లింక్ క్లిక్ చేసి లైక్ కొట్టి, స్క్రీంషాట్ షేర్ చేస్తే వంద రూపాయలు వస్తాయి.” అన్నాడు.
లైక్ చేస్తే పైసలా? అది ఎలా? హిమేష్ గాడు అబద్దాలు చెబుతున్నాడు. సరే ఒకసారి చూద్దాం అని రమేష్ లింక్ క్లిక్ చేస్తే ఇంస్టాగ్రామ్ లో ఓపెన్ అయింది. దాన్ని లైక్ చేసి స్క్రీంషాట్ ను హిమేష్ కి షేర్ చేసాడు. వెంటనే రమేష్ అకౌంట్ లో వంద రూపాయలు క్రెడిట్ అయ్యాయి.
మళ్ళీ రెండు రోజుల తరవాత ఫోన్ లో
“కిషోర్ సర్ గుడ్ మార్నింగ్. ఐయామ్ హిమేష్ ఫ్రమ్ “షేర్ వాలా” స్టాక్ ట్రేడింగ్ కంపెనీ. మీకు టెలిగ్రామ్ లో మా యాప్ లింక్ పంపాను, మీరు యాప్ లో రిజిస్టర్ చేసుకొని తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి చూడండి” అంటూ మంచి స్స్టాక్ అడ్వైసర్ గా సలహా ఇచ్చాడు.
కిషోర్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసాడు గాని, మనుసులో ఎదో మూలన వున్న భయంతో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగిపోయాడు.
మరుసటి రోజు కాల్ “ సర్, మై హిమేష్ హు. హౌ ఆర్ యూ?”. అని మంచి పరిచయస్తుడిలా మాట్లాడుతూ,
“ఈఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్, జస్ట్ ఇన్వెస్ట్ వన్ థౌసండ్ రూపీస్ అండ్ చెక్ ద రిజల్ట్స్” అన్నాడు స్టైల్ గా ఇంగ్లీష్ లో.
“సర్లే, వేయి రూపాయలేగా ఓసారి టెస్ట్ చేద్దాం”అని కిషోర్ ఇన్వెస్ట్ చేయగా పదిహేను వందలు యాప్ అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు కనిపించింది.
మరుసటి రోజు రెండు వేలు వేస్తె రెండూవేల ఐదు వందలు వచ్చాయి.
కిషోర్ ఆనందం పట్టలేక ఎగిరి గంతులేస్తూ, “లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో” అని F3 సినిమా సాంగ్ హమ్ చేస్తూ వంటిట్లోకి వెళ్లి లక్ష్మి భోజనం పెట్టు అన్నాడు ఉషారుగా.
ఇవాళ చాలా హ్యాపీ గా కనిపిస్తున్నారేమిటో ? అని అడిగింది భర్త సంతోషాన్ని గమనించిన లక్ష్మి.
“మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే నే బిజినెస్ చేయలేననుకున్నావా. త్వరలో చేసి చూపిస్తా లక్ష్మి” అంటూ ఛాలెంజ్ సినిమాలో రావుగోపాలరావు కు చిరంజీవి ఛాలెంజ్ విసిరినట్టు కిషోర్ లక్ష్మికి ఛాలెంజ్ చేసాడు.
నెక్స్ట్ డే హిమేష్ ఫోన్ చేసి “సర్ యాప్ లో కొన్ని టాస్క్ లు వున్నాయి. అవి పూర్తి చేసి ఎక్కువ లాభం పొందండి.” అన్నాడు. కిషోర్ కి హిమేష్ కనిపించని దేవదూతలా అనిపించాడు.
కిషోర్ ఉషారుగా ఐదు వేలు ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ టాస్క్ పూర్తి చేస్తే ఆరు వేలు వచ్చాయి.
సెకండ్ టాస్క్ ఒక లక్ష యాబై వేలు.
ఆమ్మో! సెకండ్ టాస్క్ లార్జ్ అమౌంట్ వుంది. ప్రాఫిట్ రాకపోతే, వున్నవి పొతే ఎలా అని భయంతో కిషోర్ వెనక్కి తగ్గాడు.
మరుసటి రోజు హిమేష్ ఫోన్లో “కిషోర్ గారు మీరు టాస్క్ బాగా చేస్తున్నారు.కీప్ గోయింగ్. సెకండ్ టాస్క్ చేయండి, భయపడకండి. దైర్యే సహాసే లక్ష్మి అన్నారు. కోటిశ్వరుడు అయ్యే ఛాన్స్ మిస్ చేసుకోకండి. ట్రై చేయండి అన్నాడు.”
“హిమేష్ భాయ్ నాకు సలహాలు ఇస్తున్నావ్ నీకేంటి లాభం.” అడిగాడు కిషోర్.
“సర్ మీరు ఇన్వెస్ట్ చేసి లాభాలు సంపాదిస్తే మా అడ్వైసర్స్ కు కంపెనీ కొంత కమిషన్ ఇస్తుంది” అని బదులిచ్చాడు.
హిమేష్ సమాధానంలో కిషోర్ కు నిజాయితీ కన్పించింది.
నిజమేగా. ప్రయత్నిస్తే పోలె! అని తన వ్యాపారం కోసం దాచుకున్న డబ్బులోంచి లక్ష యాబై వేలు ఇన్వెస్ట్ చేసి టాస్క్ ఫినిష్ చేసాడు రమేష్. స్క్రీన్ పై అమౌంట్ మైనస్ లక్ష యాబై వేలు చూసి కిషోర్ కి ఒక్కసారి తన కింది నున్న భూమి రెండుగా చీలిపోయి తాను అగాధం లో పడిపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది.
కంగారు పడ్డ కిషోర్ వెంటనే తేరుకొని “హలో. హిమేష్ బాయ్. యాప్ లో నా లక్ష యాబై వేలు మైనస్ లో కన్పిస్తుంది. ఏ కైసా ఉహ బాయి” అని ఫోన్ చేసాడు.
“సర్ మీరు పొరపాటున ‘బై’ఆప్షన్ అని సెలెక్ట్ చేశారు. ఇ టాస్క్ కి డౌన్లోడ్ అని సెలెక్ట్ చేయాలిసివుండే.”
“మరి ఇప్పుడెలా?“ అన్నాడు కిషోర్.
“డోంట్ వర్రీ సర్. నెక్స్ట్ టాస్క్ మూడు లక్షలు వుంది. అది చేయండి. మీ ఓల్డ్ అమౌంట్ మరియు న్యూ ఇన్వెస్ట్మెంట్ పైన ప్రాఫిట్ తీసుకోండి” నన్ను నమ్మండి. మీరు లాభాల బాట పడతారు.” అని అడ్వైస్ ఇచ్చాడు హిమేష్.
నష్టాల ఉబి నుండి బయట పడటానికి కిషోర్ మళ్ళీ మూడు లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. యాప్ లో ప్రాఫిట్ తో కలిపి ఆరు లక్షలు కనిపిస్తుంది. అది చూడగానే రమేష్ ముఖం సంతోషంతో వెలిగింది. తాను తెలివైన పనే చేశానని, తనకు తాను మనసులో శబాష్ అనుకొని, అమౌంట్ విత్డ్రాల్ చేసి వ్యాపారం చేసుకుందామని ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ పని చెయ్యట్లేదు.
కిషోర్ వళ్లంతా చెమటలు, శరీరం చల్లబడింది. చేతుల్లో చిన్నగా వణుకు, రెండు చేతులతో తల పట్టుకుని కుర్చీ లోంచి నెమ్మదిగా లేచి కొద్ది సేపు సోఫా లో కూర్చుని తల గోడకు అనించి కళ్ళు మూసుకున్నాడు. నేనేమైన మోసపోయానా? ట్రేడింగ్ కంపెనీ చాలా ఫేమస్ కదా అనుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ వంటింట్లో కి వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేసి చల్లని వాటర్ బాటిల్ తీసి గబా గబా తాగాడు. అవే చల్లని నీళ్లు కొన్ని ముఖం పై చల్లుకున్నాడు.
ఆ రోజు ఆదివారం కావడం తో లక్ష్మి కూడా ఇంట్లోనే వుంది.
కిషోర్ కంగారుగా ఉండటం, అబ్బాయితో, తనతో గడపకుండా రూమ్ లో నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడం తో అనుమానమొచ్చి
“కిషోర్ ఎని ప్రాబ్లెమ్? అంది లక్ష్మి.
“నో లక్ష్మి. నీ పని చూసుకో.”
దీనికెప్పుడూ సమాధానాలు చెప్పాలి. ఇ పెళ్ళాలు మొగుళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు అని గోనుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.
హిమేష్ కి కాల్ చేస్తే ఏదయినా సలహా ఇస్తాడని కిషోర్
అతనికి కాల్ చేసాడు. “బాయ్, యాప్ లో నా అమౌంట్ విత్డ్రా కావట్లేదు ఏం చేయాలి?
“ఓ. అలాగా. రూల్స్ ప్రకారం లార్జ్ అమౌంట్ కాబట్టి టాక్స్ పే చేయాలి? అని హిమేష్ చెప్పడం తో.
“ఎంత?” అడిగాడు కిషోర్.
“యాబై వేలు”. టకీమని చెప్పాడు
“ఆమ్మో! నా దగ్గర డబ్బు లేదు. వున్నదంతా ఉడ్చి మీ యాప్ లో ఇన్వెస్ట్ చేశాను”.
“ఎలాగైనా టాక్స్ కట్టి మీ పూర్తి ప్రాఫిట్ అమౌంట్ ఆరు లక్షలు తీసుకోండి” అన్నాడు హిమేష్.
అరరె చిక్కుల్లో పడ్డానే. ఇపుడేట్లా అని ఆలోచిస్తూ టెన్షన్ తో తల బాదుకుంటూ ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు కిషోర్.
లక్ష్మి: “ ఏంటండీ. అలా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు”
ఆ. పెద్ద విషయాలు చెపితే నీ మట్టి బుర్రకు ఎక్కవు. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు” అని చికాకుగా అన్నాడు కిషోర్.
చిన్న విషయాలకి చిర్రు బుర్రు లాడితే ఏం లాభం. అసలు విషయం చెప్తే నాకు తోచిన సహాయం చెస్తానండి.
నువ్వు జస్ట్ ఇంటర్ పాస్. నాకే సలహా ఇస్తావా? వంటింట్లో పని చూసుకో!” అంటూ హుంకరించాడు. “అలాగే వేడివేడిగా కాఫీ తీసుకురా,” అని గద్దించి, మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళాడు. భర్త మాటలు లక్ష్మికి శూలంలా గుచ్చుకున్నాయి. అయినా ‘ఆయన మాటతీరే అంత’ అని తనకు తాను సర్దిచెప్పుకొని కాఫీ పెట్టడానికి వెళ్ళింది.
కొద్దిసేపట్లో లక్ష్మి కాఫీ కప్పుతో “ఇదిగో కాఫీ “ అంటూ రూమ్ తలుపు తట్టింది.
కిషోర్ తలుపు తీసి హలో కూర్చొని నెమ్మదిగా కాఫీ తాగుతున్నాడు. కిషోర్ బుర్ర గిరగిర తిరుగుతోంది. గుండెల్లో ఎదో బాధగా వుంది. నరాలు చిట్లిపొతాయేమో అన్ననంతగా టెన్షన్. ఉన్న డబ్బు అంతా యాప్ లోనే వుంది. ఎలాగైన యాబై వేలు తెచ్చి మళ్ళీ తన డబ్బు ప్రాఫిట్ తో తీసుకోని స్వంత బిజినెస్ స్టార్ట్ చేయాలనీ కిషోర్ గట్టిగా నిర్ణయించుకున్నాడు.
చిన్నగా లక్ష్మి దగ్గరికి వెళ్లి “ నేను ఒకటి అడుగుతా. కాదనొద్దు ప్లీజ్” అన్నాడు.
“ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావంటే నీకు ఎదో డబ్బు అవసరమైంది” అంది లక్ష్మి.
“నీ బంగారు నెక్లెస్ ఇవ్వు, తాకట్టు పెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ విడిపిస్తాను”.
“విషయం చెపితేనే ఇస్తాను.” అని ఖరాకండిగా చెప్పడంతో తప్పేటులేదని యాప్ ఇన్వెస్ట్మెంట్ సంగతి చెప్పాడు కిషోర్.
అంతా విన్నాక లక్ష్మి ఒక్క ఉదుటున లేచి “ఓరి! నా తెలివితక్కువ మొగుడా. ఆ హిమేష్ గాడు నిన్ను ఫూల్ ని చేసి నీకు శఠగోపం పెట్టాడు. గొర్రె కసాయి వాడిని నమ్మడం" అంటే ఇదే.
అయ్యో భగవంతుడా!. ఎంత పనిచేసావ్ కిషోర్. ఉన్నదంతా వాడికి సమర్పించావ్, ఇక మన డబ్బు తిరిగిరావడం కల్ల” అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది.
ఎందుకు రాదు?. అడిగాడు కిషోర్ అమాయకంగా.
“అది ఫేక్ యాప్ కాబట్టి “ అని లక్ష్మి
“నో. షేర్ వాలా యాప్ ఫేమస్ తెలుసా?.” తాను అంత ఇజీగా మోసపోననే కాంఫిడెన్స్ తో చెప్పాడు కిషోర్.
“పేరు అదే. యాప్ ఫేక్. డబ్బులు పెట్టగానే ప్రాఫిట్ చూపిస్తూ, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. ఇది సైబర్ ఫ్రాడ్. టీవీల్లో పేపర్లో చూడటం లేదా.”
లక్ష్మి మాటలు విని బిత్తర చూపులు చూస్తున్నాడు కిషోర్
“అంతా అయిపోయాక అలా ఎర్రిమొఖం వేసుకుని చూస్తావేంటి?
ఆ దిక్కుమాలిన క్రికెట్, పొలిటికల్ డిబెట్ మాత్రమే చూస్తే సరిపోదు.అప్డేట్ కావాలి” అని కిషోర్ ని ఎత్తి పొడిచింది లక్ష్మి.
కిషోర్ కి భార్య తన పరువు తీస్తుంది అని అర్థమైంది.
“ఇప్పుడే మీ అడ్వైసర్ హిమేష్ గాడికి ఫోన్ చేయి. యాప్ సంగతి చిటికెలో తెల్చేస్తానంది” లక్ష్మి.
“హలో. హిమేష్ జీ” అనగానే.
“సర్. జల్దీ పచ్చాస్ హజర్ టాక్స్ పే కరో. నహి తో పెనాల్టీ బర్నా పడతా” అన్నాడు హిమేష్.
కిషోర్ చేతిలోంచి లక్ష్మి ఫోన్ లాక్కుని
హిమేష్ పై ప్రశ్నల వర్షం కురిపించి, తెలుగు, హిందీ లో ఎడా పెడా వాయించేసింది. లక్ష్మి కి సైబర్ క్రైమ్స్ పై వున్న నాలెడ్జికి ఖంగుతిన్న హిమేష్ ఏం మాట్లాడాలో తోచని స్థితిలో సంభాషణ మధ్యలోనే ఫోన్ కట్ చేసాడు.
“కిషోర్ ఇప్పుడు నీ షేర్ వాలా యాప్ పనిచేయదు. ఒక సారి చెక్ చేయి.” అంది లక్ష్మి.
కిషోర్ యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు కానీ యాప్ ఓపెన్ కాలేదు.
మరోసారి ట్రై చేస్తా అని
ముఖం పై చమటను ఎడమ చేయితో తుడుచుకుంటూ, వణుకుతున్న కుడి చేతి వేళ్ళతో మౌస్ క్లిక్ చేస్తుంటే, యాప్ ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో తాను నిండా మునిగిపోయానని కిషోర్‌కు స్పష్టంగా అర్థమైపోయింది. సరిగ్గా అదే సమయంలో పక్కింటి ఎఫ్.ఎమ్ రేడియోలో “అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే” అనే పాట లీలగా వినిపిస్తూ అతన్ని వెక్కిరిస్తోంది.
అయ్యో! దేవుడా.. నా కష్టార్జితం అంతా ఆ మాయదారి యాప్‌లో పెట్టానే! అత్యాశకు పోయి ఉన్నది కాస్తా ఊడ్చేశానే!" అంటూ కిషోర్ నెత్తి నోరు కొట్టుకుంటూ చతికిలబడ్డాడు. కళ్లముందు చీకట్లు కమ్ముతుంటే, ఆ నిస్సహాయత అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
లక్ష్మి తన భర్త అమాయకత్వాన్ని చూసి బాధపడినా, సమయస్ఫూర్తితో వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసింది.
అప్పుడు కిషోర్ ఆమె చేతులు పట్టుకుని పశ్చాత్తాపంతో.. "లక్ష్మీ! నువ్వు అడ్డుకోకపోతే నీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఆ సైబర్ దొంగల పాలు చేసేవాడిని. ముందుగా ఒక్క మాట నీతో డిస్కస్ చేసినా అంత డబ్బు పోయేదిగాదు. నీకేం తెలియదని నిన్ను చిన్న చూపు చూడడం నా తప్పు.
ఈ సైబర్ మాయగాళ్ల నుండి నన్ను, మన కుటుంబాన్ని ఇంకా మోసపోకుండా కాపాడావు" అంటూ ఆమె వైపు కృతజ్ఞతగా, ప్రేమగా చూశాడు.
డా.ఎస్. రాజేష్ కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్
డిపార్ట్మెంట్ అఫ్ ఇంగ్లీష్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజ్గిరి
09/03/2026
Comments
Post a Comment